మరో రెండు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్రం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మరో రెండు రోజుల్లో అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) ప్రారంభం కానుంది. జులై 1 నుంచి ఈ యాత్ర మొదలవుతుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. యాత్రకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర, భద్రతపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులతో సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. గతంలో ఈ యాత్రకు సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(CRPF) భద్రత కల్పించేది. అయితే ఇప్పుడు ఈ యాత్రకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది భద్రత కల్పించనుంది.
జులై 1 నుంచి ప్రారంభం అయ్యే ఈ యాత్ర(Amarnath Yatra) ఆగస్టు 31వ తేది వరకూ కొనసాగనుంది. మొత్తంగా 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. గత ఏడాది ఈ యాత్ర సాగుతుండగా భీకర గాలులు వ్యాపించాయి. అంతేకాకుండా మెరుపు వేగంతో వరదలు వచ్చాయి. ఆ సమయంలో ఐటీబీపీ జవాన్లు ఎంతో సమర్థవంతంగా యాత్రికులను కాపాడారు. అందుకే ఈసారి యాత్రికుల పూర్తి భద్రతా బాధ్యతను వారికే అప్పటించినట్లు కేంద్రం వెల్లడించింది.