»20 Dead As Tractor Overturns In River Up Shahjahanpur
Tractor overturns: ట్రాక్టర్ బోల్తా 20 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 40 మందితో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ గర్రా నది వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇరవై మంది మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ‘భగవత్ కథ’ కోసం గర్రా నది నుంచి నీటిని తీసుకురావడానికి 40 మంది భక్తులు ట్రాక్టర్లో వెళుతున్న క్రమంలో ప్రమదవశాత్తు వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటన థానా తిల్హర్ ప్రాంతంలోని బిర్సింగ్పూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిచే సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన యూపీ సీఎం యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.