అనంతపురము జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్ వార్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దరెడ్డిపై ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పలు విషయాలపై వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. అయితే శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రలో కరపత్రాలు కలకలం రేపాయి. ఎమ్మెల్యేగా మూడేళ్లలో పెద్దారెడ్డి ఏం చేశారని ప్రశ్నిస్తూ కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి.
కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చూపించడంతో వివాదం మొదలైంది. ఈ కరపత్రాలపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేక గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు రేపేందుకు ఇలా కరపత్రాలు పంచుతున్నారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి దమ్ముంటే 30 ఏళ్లలో తాడిపత్రికి చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. తాను మూడేళ్లలో ఏం చేశానో చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. తాను డబ్బుల కోసం ఎవరికీ పదవులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
తాడిపత్రిలో మళ్లీ ఫ్యాక్షన్ గొడవల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. తాను వాళ్ల ఇంటికి వెళ్లినవాడినని, జేసీ బెడ్రూమ్ లోకి వెళ్లలేనా? అని ప్రశ్నించారు. తాను తలచుకుంటే జేసీ సోదరులు తాడిపత్రి విడిచివెళ్లిపోతారని, ఆ పరిస్థితి తీసుకురావొద్దనే ఉద్దేశంతో గమ్మున ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు తన అన్నను చంపించారని, తాను కక్ష తీర్చుకోవాలంటే గంట సమయం కూడా పట్టదంటూ హెచ్చరించారు. ఇలా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది.