మహిళల దినోత్సవ కార్యక్రమాలు (International Women’s Day) తెలుగు రాష్ట్రాల్లో సందడిగా జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టగా.. ఏపీలో జనసేన, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. కాగా యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) మహిళలందరికీ కాళ్లు మొక్కి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు.
అన్నమయ్య జిల్లా (Annamayya District) పీలేరు (Pileru) నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్నది. పాదయాత్రలో భాగంగా 38వ రోజు బుధవారం యాత్ర ప్రారంభించిన లోకేశ్ మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ పాత్రల్లో చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మహిళల సమస్యలను తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ కు మహిళలు వివరించారు.
అంతకుముందు లోకేశ్ మహిళలకు ట్విటర్ (Twitter) ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు. మానవ సమాజ వికాసానికి దిక్సూచి స్త్రీశక్తి. అణచివేతని అధిగమించారు. విద్య, విజ్ఞానాలను సముపార్జించారు. పోరాడి హక్కులు సాధించుకున్నారు. అన్నిరంగాల్లోనూ అగ్రగణ్యులుగా రాణిస్తున్న మహిళామణుల స్వయంకృషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. మహిళల సమస్యలు తొలగాలంటే వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు మహిళలను కోరారు.