తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలంరేపింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుత సంచారం ట్రాప్ కెమెరాల్లో రికార్డైనట్లు చెబుతున్నారు.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ కూడా హెచ్చరించింది.
అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలవరపెడుతోంది. గతంలో ఓ బాలుడిపై దాడి చేసి గాయపరచగా.. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బాలికను చిరుత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బోన్లు ఏర్పాటు చేసి ఐదు చిరుతల్ని బంధించారు.. దీంతో చిరుతల బెడద తప్పిపోయిందని భావించారు.. కానీ తాజాగా మరో చిరుత సంచారం కలకలం రేపింది.
టీటీడీ కూడా భక్తుల రక్షణ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నడకమార్గంలో రాత్రి 10 గంటల తర్వాత ఎవరినీ అనుమతించడం లేదు.. ఉదయం ఆరు తర్వాతే అనుమతిస్తారు. అంతేకాదు 12 ఏళ్లలోపు పిల్లల్ని నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి లేదు. టీటీడీ చిరుతల నుంచి రక్షణ పొందేందుకు భక్తులకు కర్రల్ని పంపిణీ చేస్తోంది. అలాగే భక్తులు గుంపులుగా నడిచి వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే గార్డుల్ని కూడా నియమించారు.