వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార వైసీపీ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. 2024లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, తమకు ఎవరితో పొత్తు అవసరంలేదని చెబుతూనే, ప్రతిపక్షాలు మాత్రం గెలిచే సత్తాలేక పొత్తుకు సిద్ధపడ్డాయని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎలా పోటీ చేసినా, తమకు 175 స్థానాలు ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేత టీజీ వెంకటేష్ పొత్తులపై దాదాపు తేల్చేశారనే చెప్పవచ్చు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప కలిసి పోటీ చేయవచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్తామని కుండబద్దలు కొట్టారు. బీజేపీకి పవన్ కళ్యాణ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, కలిసి వెళ్లే అవకాశాలే ఉన్నాయన్నారు. రెండువైపులా ఏవైనా ఇబ్బందులు ఉంటే మాత్రమే అవకాశం ఉండదని, కానీ ఇప్పటికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. టీడీపీతో పొత్తుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి టీడీపీ శాశ్వత శత్రువు కాదన్నారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లో ఏ పార్టీకి శాశ్వత మిత్రులు లేదా శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారు. ఇది టీడీపీకీ వర్తిస్తుందన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని కూడా స్పష్టం చేశారు.
టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు, బీజేపీ తీరు జనసేనతో కలిసి వెళ్లేందుకే ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా కమలం పార్టీతో కలిసి వెళ్లేలా కనిపిస్తున్నప్పటికీ, ఎన్నికలకు ముందు ఏం జరుగుతుందో చెప్పలేం. అప్పుడు పరిస్థితులు మారితే, బీజేపీకి దూరం జరిగినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఇరువైపులా కలిసి వెళ్లే ధోరణిలో ఉన్నారు. అలాగే, గత కొద్ది నెలలుగా టీడీపీ కూడా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తమకు ప్రయోజనాన్ని బట్టి బీజేపీ చంద్రబాబును దరి చేర్చుకునే అవకాశాలు ఉంటాయి.