తన అన్నయ్య తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. నా కొడుకు సేఫ్గా ఉన్నాడని, వైద్యులకు పాదాభివందనం అన్నారు బాలయ్య. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తు చేశారు. అతనికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందన్నారు. కానీ అద్భుతం జరిగిందని, మళ్లీ కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. తాము కుప్పం హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరు కూడా నారాయణ హృదయాలయను రికమెండ్ చేశారని, ఇక్కడకు వచ్చామన్నారు. వైద్యులు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారన్నారు. కుప్పం నుండి తీసుకు వచ్చిన పొజిషన్లోనే ప్రస్తుతం ఉన్నాడని, ఇంప్రుమెంట్ కోసం చూస్తున్నట్లు చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనలతో ఆయన కోలుకుంటున్నాడన్నారు.
ఆర్గాన్స్ అన్నీ బాగానే పని చేస్తున్నాయన్నారు. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల స్టంట్ వేయడం కుదరలేదని చెప్పారు. అలా వేస్తే మళ్లీ గుండెపోటు అటాక్ కావొచ్చునని, అందుకే వేయలేదన్నారు. బ్రెయిన్ డ్యామెజ్ కాలేదని భావిస్తున్నట్లు చెప్పారు. వైద్యులు స్టెప్ బై స్టెప్ అన్నీ చేస్తున్నారన్నారు. మెడికేషన్కు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. గిచ్చితే ఒకటిరెండుసార్లు స్పందించాడని, మరోసారి స్పందించలేదన్నాడు. అంటే మెడికేషన్ పని చేయడానికి కాస్త సమయం తీసుకుంటుందని తెలిపారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉంటారన్నారు. ఎంతో ఓపిక ఉన్న వ్యక్తిత్వం అన్నాు. ఇటు అభిమానులతో, అటు పార్టీ కార్యకర్తలతో ఎంతో బాగా ఉంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక అభిమానులు, ప్రజలు ఆయన కోసం పూజలు చేస్తున్నారని, తప్పకుండా త్వరలో కోలుకుంటారన్నారు. మావాడి కోసం ప్రార్థనలు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు అన్నారు. మీరు చేస్తున్న ప్రార్థనలకు తప్పకుండా త్వరలో కోరుకుంటారన్నారు.