Srivari Brahmotsavam : పదేళ్ల మౌనిక అనే అమ్మాయితే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి నిశ్చితార్థం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో(Rayadurgam) ఏటా బ్రహ్మోత్సవాల( Brahmotsavam) సమయంలో వేంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. ఆ ఉత్సవంలో అక్కడి అరవా తెగకు చెందిన బాలికతో స్వామి వారికి కళ్యాణం నిర్వహించడం అక్కడ ఎప్పటి నుంచో ఆనవాయతీగా వస్తోంది.
ఈ సంప్రదాయంలో భాగంగానే పట్టణంలోని రమేష్, జయమ్మల కుమార్తె మౌనికతో శ్రీవారికి నిశ్చితార్థం జరిగింది. మే 25న ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవితో పాటు మౌనికతో కూడా స్వామి వారికి కళ్యాణం జరిపిస్తారు. దీంతో అంతకు ముందుగానే స్వామికి బాలికతో నిశ్చితార్థం వేడుకను నిర్వహించారు.
వేంకట రమణుడి తరఫున దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి నరసింహారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షి రెడ్డి, భక్తులు మేళ తాళాలతో బాలిక ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పెళ్లి కూతురిలా అలంకరించి ఉన్న మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో సహా ఊరేగింపుగా అక్కడి మార్కండేయ స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. స్వామి రూపంగా కలశాన్ని ఉంచి దానితో ఆమెకు నిశ్చితార్థం జరిపించారు. అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ వీధుల్లో ఊరేగించారు.