తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేయడం పట్ల మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా స్పందించారు. ప్రతిగా లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, తాము మళ్లీ వస్తే ఏం చేయనున్నారో చెప్పకుండా పాదయాత్ర అంటూ నడవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని హైదరాబాద్‌లో దాచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మళ్ళీ తండ్రిని సీఎం పీఠం పైన కూర్చుండబెట్టాలని తహతహలాడుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌ను వేధించారన్నారు. అయినప్పటికీ తమ అధినేత ఆత్మస్థైర్యంతో పాదయాత్ర చేస్తూ, పేదల కష్టాలను విన్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే తాము మరోసారి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు.
చంద్రబాబు తమకు అవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటారని, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరిస్తారని ఆరోపించారు. ఈ తండ్రీకొడుకుల దుర్మార్గాన్ని నందమూరి ఫ్యామిలీ గుర్తించలేకపోతోందన్నారు. నీ సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే పదిమంది కూడా నీతో లేకుండా పాదయాత్ర చేస్తావని లోకేష్ పైన మండిపడ్డారు. ఆయనది యువగళం కాదని, ఒంటరిగళమన్నారు. లీడర్‌గా వంద శాతం ఫెయిల్యూర్ అన్నారు. మంగళగిరి ప్రజలు గుర్తించారు కాబట్టే ఓడించారన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని రికార్డు లోకేష్‌ది అని ఎద్దేవా చేశారు.