మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేప(Pulasa fish)లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలి’ అంటారు.దీని రుచి అంట గొప్పగా ఉంటుంది మరి. అది పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District). జిల్లాలో పెనుగొండ మండలం సిద్దాంతం అనే గ్రామం ఒకటి. అక్కడికి సమీపంలోని వశిష్ఠ గోదావరి బ్రిడ్జి దగ్గర పులస చేపల విక్రయాలు జోరుగా కొనసాగుతాయి. ఈ నోరూరించే పులస చేపలు ఉభయగోదావరి జిల్లాలో తప్ప రాష్ట్రంలో మరీ ఎక్కడా దొరకవు. ఇప్పుడు గోదావరి(Godavari)లోకి ఎర్ర నీరు రావడంతో పులస చేపలు సందడి చేస్తున్నాయి.
దీంతో జాలర్లు పులస చేపల వేటలో పడి బిజీ అయ్యారు.ఒక్క పులస ఫిష్ రేటు దాదాపు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయలు పలుకుతోంది. ఇంత ధర ఎందుకంటే వెండి రంగులో ఉండే ఈచేప రుచి అంతాఇంతాకాదండోయ్. అంతేకాదు ఈ ఫిష్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికే అరుదైన చేప. అందుకే జనాలు ఎంత ధరైనా సరే వెనుకాడకుండా కొనుగోలు చేసి లొట్టలేసుకుని మరీ తింటారు. చెప్పాలంటే పులస చేపల ఆశ చూపితే సచివాలయం(Secretariat)లోని ఫైల్స్ కూడా ఇట్టే కదులుతాయట.ఇక హిల్సా ఇలిషా పులస చేప శాస్త్రీయనామం. ఆరోహవలస జాతికి చెందిన పులస, ఇలాసగా జీవనం సాగిస్తుంది. సంతాన ఉత్పత్తి కోసం హిందూమహాసముద్రం నుండి బంగాళఖాతం చేరుకుని అక్కడి నుంచి సుదీర్ఘంగా ఈదుతూ గోదావరిలోకి వలసలుగా వస్తాయి.
అయితే పులస చేపల పులుసు చేయడం కూడా అంతసులువు కాదంటున్నారు ఉభయగోదావరి జిల్లా వాసులు. పిడకల పొయ్యి మీద వెన్నరాసిన కుండలో వండిన కూర తింటే ఆరుచే వేరంటున్నారు.గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం (Dhavaleswaram) చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. చెనల చేప అంటే ఆడచేప, గొడ్డుచేప అంటే పోతు చేప. ఇలా పలురకాల పేర్లతో వీటిని విక్రయిస్తారు. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట, ఉప్పుటేరులో కొల్లేరు సరస్సు (Kolleru Lake) కలిసేచోట లభించే చేపలకూ ఎంత ప్రత్యేకత ఉందో అంత గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో అడపాదడపా లభించే పులస చేపలు ఆగస్టు నుంచి విరివిగా లభ్యమవుతాయి.