కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఎంతో బాధాకరం అన్నారు. సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు అని కొనియాడారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి… ఆకర్షించాయన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. పవన్ వెంట దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు చిత్రసీమకు స్వాతిముత్యాల్లాంటి ఆణిముత్యాలను అందించిన కళాతపస్వి శ్రీ K. విశ్వనాథ్ గారి మరణ వార్త అత్యంత బాధాకరం, తెలుగు జాతికి తీరని లోటు.’ అని జనసేన ట్వీట్ చేసింది.
మాస్టర్ ఆఫ్ ది క్రాఫ్ట్, తనకు అత్యంత ఇష్టమైన డైరెక్టర్లలో ఒకరు, ప్రతి నటుడికి విశ్వనాథ్ ఒక టీచర్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వారు మనల్ని వదిలి వెళ్లారు కానీ… ఆయన కళాఖండాలు మనతో ఉన్నాయని పేర్కొన్నారు.
సినిమా విషయంలో ఆయన ఏం నమ్మినారో చివరి వరకు దానికే కట్టుబడి ఉన్నారని నటి రాధిక అన్నారు. ఆయనతో పని చేసిన రోజులను తాను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.
భారత చలన చిత్ర పరిశ్రమలో విరబూసిన స్వర్ణకమలం విశ్వనాథ్ గారు అని బ్రహ్మానందం అన్నారు. పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదని, కానీ అద్భుత మరణాన్ని పొందిన విశ్వనాథ్ గారు కళ బతికి ఉన్నంత కాలం, కళాకారులు బతికి ఉన్నంతకాలం మనతో ఉంటారని బ్రహ్మానందం పేర్కొన్నారు.
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. అత్యద్భుత చిత్రాలని తెరకెక్కించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన దిగ్దర్శకుడు దివంగతులవడం చాలా బాధాకరమని నారా లోకేష్ అన్నారు.