ATP: తిరుమల లడ్డూ వివాదంపై గుంతకల్ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. గుత్తి ఆర్ఎస్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో హిందువులు సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘కొందరు కలియుగ దైవం వేంకన్ననను అపవిత్రం చేయాలని చూస్తున్నారు. అయితే ఆ స్వామిని అపవిత్రం చేయడం ఈ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు’ అని అన్నారు.
KDP: పులివెందుల విజయ హోమ్స్‌లోని HP గ్యాస్ అధినేత హరినాథ్‌రెడ్డి ఇంట్లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడగా..1kg బంగారు, 2.50kg వెండి, రూ.లక్ష నగదు పోయినట్లు సమాచారం. హరినాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూర్‌కు వెళ్లగా… ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం.
KDP: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. వీరబల్లి మండలం పెదవీడు పంచాయితీ రెడ్డివారిపల్లె జడ్పీ హైస్కూల్‌లో ఆదివారం జరిగిన ప్రజావేదికలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి, ప్రతినెలా 1కే ఇళ్లవద్ద రూ.4వేలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు.
KDP: సిద్దవటం మండలంలోని వంతాటిపల్లి గ్రామ పంచాయతీ సంటిగారి పల్లి గ్రామం సూచిక బోర్డు ముళ్ళ పొదల్లో ఉండడంపై, బోర్డు కనపడటం లేదని గ్రామ ప్రజలు అంటున్నారు. కొత్త వారు ఎవరైనా రావాలి అంటే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, ముళ్ల పొదలను తొలగించి, సూచిక బోర్డు కనపడే విధంగా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కృష్ణా: ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో సెప్టెంబర్ 23న జిల్లా లాంగ్ టెన్నిస్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్టీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఏం. శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 14,17 బాల, బాలికలకు జరుగుతాయన్నారు.
విజయనగరం: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూపర్‌వైజర్ నిర్మల పిలుపునిచ్చారు. శనివారం బొబ్బిలి పట్టణంలోని కోరాడ వీధిలో పోషకాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు.
కృష్ణా: గంపలగూడెం మండలం పెనుగలను గ్రామంలో ఉన్న దళితుల శ్మశాన వాటిక పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ లలిత కుమారి తెలిపారు. దీర్ఘకాలికంగా కంప చెట్లు పెరిగి మృతదేహాలను తరలించేందుకు సైతం అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పునరుద్ధరించకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ పనులు చేపట్టినట్లు వివరించారు.
CTR: బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కేంద్రంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. వీకోటలో ఇప్పటికే ఇద్దరు చిన్నారులు డెంగీ బారిన పడి మృతి చెందారని చెప్పారు. బైరెడ్డిపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా శాఖ అధికారులు, కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు.
NLR: పట్టణంలోని పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద పోలేరమ్మ జాతర కరపత్రాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అంతకుముందు పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలందరికీ పోలేరమ్మ తల్లి కృప ఉండాలని మనసారా కోరుకుంటున్నామన్నారు.
PLD: రాష్ట్రంలోని ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని కే(K) కన్వెన్షన్ హాల్ వద్ద PPWA ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన GODAX వర్కుషాప్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఫోటోగ్రాఫర్లు ఘనంగా సన్మానించారు.
TPT: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు,అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి…బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు.
VZM: నెల్లిమర్ల నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని మోపాడలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో ఎంతో ప్రగతిని సాధించామన్నారు. అర్హులందరికీ సంక్షేమ పధకాలు అందిస్తామని చెప్పారు. అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామన్నారు.
SKLM: ఎన్డీఎ కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు పరిరక్షించి పూర్వ వైభవం తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు అన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తింపు లభించిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి వార్షిక ఉత్సవాల గోడ పత్రికను కోటబొమ్మాళిలో ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం కొత్తమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
TPT: తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్‌లో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షులు తిరుమలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెప్పారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించి, కరపత్రాలను అందజేశారు.
KDP: రాయచోటి మండలం దిగువ అబ్బవరంలో నీటి సమస్య అధికంగా ఉందని ఆదివారం ఆ గ్రామానికి చెందిన పలువురు మహిళలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి.. దిగువ అబ్బవరం గ్రామంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని, ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.