TPT: అలిపిరి – చెర్లోపల్లి మార్గంలోని అటవీ ప్రాంతంలో కర్ణాటకకు తరలిస్తున్న 36 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దుంగలతోపాటు లగేజీ వ్యాను, కారు, బైకును సీజ్ చేశామన్నారు. దుంగల విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఎంటెక్ సివిల్ ఇంఛార్జ్ ప్రొఫెసర్ గోపాల రాజుపై కత్తితో సోమవారం దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. హాజరు సరిగా లేని ఓ విద్యార్థిని లేబరేటరీ టెస్టుకు అనుమతించకపోవడంతో కత్తితో దాడి చేసినట్లు బాధితుడు గోపాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో గోపాలరాజు చికిత్స పొందుతున్నారు.
TPT: నగరంలోని అన్నా క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాలను వృధా చేయకుండా కావలసినంత భోజనం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ప్రజలను కోరారు. నగరంలోని న్యూ బాలాజి కాలనిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ను ఇవాళ కమిషనర్ పరిశీలించారు. ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు ఇస్తున్న టోకెన్‌లు పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
కోనసీమ: ఆలమూరు జనార్ధన స్వామి వారి ఆలయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, వెండి బంగారు ఆభరణాల తనిఖీదారు విళ్ళ పల్లంరాజు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రతి మూడేళ్లకోసారి స్వామివారి ఆభరణాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. జనార్ధన స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ పార్వతీ, భట్టీవిక్రమార్కేశ్వర స్వామి వారి దేవస్థానం ఆభరణాలను సైతం ఆయన తనిఖీ చేశారు.
E.G: గోకవరం మండలం కామరాజుపేట శ్రీ వేణుగోపాల సహకార సంఘం వద్ద యూరియా కోసం సోమవారం ఎండలో నిలబడినట్లు రైతులు ఆరోపించారు. కోఆపరేటివ్ సొసైటి సిబ్బంది సామాన్య రైతులకు ఇవ్వకుండా, ధనవంతులైన రైతులకు మాత్రమే యూరియా ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బస్తా యూరియా కావాలంటే కాంప్లెక్స్ ఎరువులు తప్పనిసరిగా కొనాలని సిబ్బంది ఆంక్షలు పెడుతున్నారని రైతులు వాపోయారు.
W.G: కూటమి ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్ నిర్ణయంతో ఆటో డ్రైవర్ కుటుంబాలు ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని, ఆటో డ్రైవర్‌లకు న్యాయం చేయాలని భీమవరం ఆటో యూనియన్ నాయకులు కోరారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఏపీ ఆటో యూనియన్, ఐక్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ASR: డుంబ్రిగూడ మండల అంగన్వాడీ యూనియన్ (CITU) నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ ఎన్నికలు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.పోతురాజు, అంగన్వాడీ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కె.కొండమ్మ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో టీ. సత్యవతి గౌరవాధ్యక్షురాలిగా, పాంగి రాధ అధ్యక్షురాలిగా, జీ. పవిత్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కోనసీమ: కొత్తపేట మండలం పలివెల శ్రీ ఉమా కొప్పు లింగేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ప్రతి సోమవారం ఆలయం వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమం ప్రారంభించి ఏడాది గడవడంతో వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అన్నదానం అఖండ పుణ్యఫలమని ఎమ్మెల్యే బండారు తెలిపారు
NLR: చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామంలో ఇవాల మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. పరీక్షల్లో మొత్తం 7 టైఫాయిడ్ కేసులు బయటపడ్డాయని తెలియజేశారు. ప్రజలు తప్పనిసరిగా కాచిన నీళ్లు తాగాలని సూచించారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
VZM: రైతులకు మేలు జరిగేందుకు వారి తరఫున పోరాడతామని వైసీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం తెలిపారు. చీపురుపల్లిలో రైతు పోరు పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా యూరియా పంపిణీ జరిగేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదన్నారు.
GNTR: తెనాలికి చెందిన పలువురు ఉద్యోగులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతిపత్రం అందజేశారు. ఎన్జీవో అసోసియేషన్ పదవీ కాలం పూర్తయిందని, సంఘానికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. గ్రీవెన్స్‌లో మొత్తం 15 మంది వివిధ సమస్యలపై సబ్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు.
GNTR: తాడికొండలోని లాం జెడ్.పి. ఉన్నత పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు ఐసీడీఎస్ సీడీపీవో అనురాధ పౌష్టికాహారం, రక్తహీనతపై సోమవారం అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ శక్తి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం ప్రాజెక్టు సీడీపీవో ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య గురించి వివరించారు.
W.G: పెంటపాడు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ 81% పూర్తయిందని తహసీల్దార్ టి.రాజరాజేశ్వరి తెలిపారు. సోమవారం పెంటపాడులో ఆమె మాట్లాడారు. మొత్తం 22,489 కార్డులకు ఇప్పటి వరకు 18,334 కార్డులు పంపిణీ చేశామన్నారు. కాగా, 22 గ్రామాలకు గాను 17 గ్రామాల్లో రీ- సర్వే పూర్తయిందని, వెస్ట్ విప్పర్రు, బి.కొండేపాడు గ్రామాల్లో రీ-సర్వే జరుగుతుందన్నారు.
కడప: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా లే అవుట్లు వేసి ఇంటి యజమానుల నుండి కోట్ల రూపాయలు కాజేస్తున్న ఐకాన్ విల్లాస్ కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి కోరారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
TPT: ఏర్పేడు మండల కేంద్రంలో ఇవాళ వైసీపీ మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్ అన్నదాత పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు అన్నదాత పోరుబాట కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.