ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి (YCP) ఉమ్మడి నెల్లూరు జిల్లా (Nellore District) కలిసిరావడం లేదు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. ఇప్పుడు నెల్లూరు పట్టణంలో ఆ పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ (Poluboina Roop Kumar Yadav), స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మధ్య వర్గ పోరు తీవ్రమైంది. పార్టీ కార్యకర్తపై దాడి నేపథ్యంలో బాబాయ్, అబ్బాయ్ మధ్య కొనసాగుతున్న గొడవలు మరింత ముదిరాయి.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం (Student Wing) రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హాజీపై శుక్రవారం దాడి జరిగింది. కొందరు దుండగులు కత్తులతో హాజీపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హాజీని ఆస్పత్రికి (Hospital) తరలించారు. శనివారం హాజీని ఉప మేయర్ (Deputy Mayor) రూప్ కుమార్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాయ మాటలు.. మోసపు మాటలు చెబుతూ ఇలా దాడికి పాల్పడడం దారుణం’ అని పేర్కొన్నాడు. ‘చాలా విషయాలు కడుపులో మండుతున్నా నోరు విప్పడం లేదు. నేను కనుక నోరు విప్పితే అడ్రస్ దొరకడు. దయచేసి మా జోలికి రావొద్దు. మరోసారి వచ్చాడా ఇక ఎంతదాకైనా వెళ్తాం. పార్టీ పుట్టినప్పటి నుంచి మేం ఉన్నాం. మధ్యలో వచ్చినవాళ్లం కాదు. జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతో పని చేశాం. మరి అలాంటి వారిపై దాడులు చేయడమా? ఈ హత్యయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ణప్తి చేస్తున్నా’ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు.
‘పార్టీ ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నాడు. హాజీపై కత్తులతో హత్య చేసేందుకు ప్రయత్నించారు. నాతో ఉన్నాడనే కక్షతోనే ఈ దాడి (Attack) జరిగింది. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఉన్నాడు. ఇలాంటి దాడులు సరికాదు. గతంలోనూ నా అనుచరులపై, కార్పొరేటర్లపై (Corporaters) దాడులు జరిగాయి. అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడితే ఊహకు కూడా అందదు. ఈ దాడులపై సీఎం జగన్, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. నెల్లూరులో పార్టీని సర్వనాశనం చేస్తున్నారు’ అని రూప్ కుమార్ మండిపడ్డారు.