రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో తాము పని చేస్తేనే ఆయన గెలిచాడని, జగన్ ఆయనకు దయతలిచి టిక్కెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. గెలిచిన మొదటి ఏడాది నుండే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల మీద రుద్దాలని చూసే ప్రయత్నం సరికాదన్నారు. తన ఫోన్ ఏడాదిన్నరగా ట్యాపింగ్‌కు గురవుతోందని ఇప్పుడు చెప్పడం విడ్డూరం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
ఆనం తప్పులు, కాంట్రాక్టుల అంశాలు అన్నీ వెలుగు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. అన్నం పెట్టిన చేతిని కాటువేసే విధంగా ఉందని, వయసు పైబడిన కారణంగా ఆనం బుద్ధి మందగించిందని ఎద్దేవా చేశారు. ఆయనను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్న విషయాని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ముందు నుండే తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికలకు ఏడాదిన్నర ఉన్న సమయంలో ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని పెంచారు. ఏడాదిన్నరగా తన ఫోన్ ట్యాప్ అవుతోందని సంచలనం సృష్టించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తుండటంతో కుటుంబ సభ్యులకు కూడా వాట్సాప్ కాల్ చేయవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తాను గతంలో ఎప్పుడూ చూడలేదని, తనకు సెక్యూరిటీని తగ్గించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చలాయిస్తున్నాయన్నారు. వివిధ అంశాలపై తాను ఆలోచించి స్పందిస్తానని చెప్పారు. టీడీపీ, వైసీపీ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని వ్యాఖ్యానించిన ఆనం, ఏ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలన్నారు.