Nara Lokesh: తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో తన సత్తా ఏంటో చూపించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక జిల్లాల వారీగా యాత్రలు చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా నారా లోకేశ్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించిన టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సైతం సక్సెస్ అయ్యింది. దీంతో ప్రజలను మళ్లీ చైతన్య పరచాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు.
సంక్రాంతి తర్వాత మొత్తం 40 రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. ఏయే జిల్లాలో ఎన్నిరోజులు పర్యటించనున్నారు, ఎవరితో భేటీ కానున్నారు అనే అంశాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులకు, పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో చూసిన సమస్యలకు హామీలు కూడా ఇచ్చారు. అయితే ఈ జిల్లాల యాత్ర పోల్ మేనేజ్మెంట్పై ఉంటుందని తెలుస్తోంది.