సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. వారంలో ఇది రెండో లేఖ కావడం గమనార్హం. ఈ లేఖలో ఆయన దళితుల పదవులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. దళితులు ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానం గురించి ఆలోచన చేయాలని కోరారు.. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని ముద్రగడ కోరారు. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సీఎంకు ముద్రగడ సూచించారు.. కొందరు దళితులు ఇతర వర్గాలు నివసించే ప్రాంతాలలో ఉండడం వల్ల లక్షలాది రూపాయలు నిధులు వారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాభా నష్టపోతున్నారని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
ముద్రగడ లేఖలో ‘రాష్ట్రంలో దళితులకు మెరుగైన పద్దతులలో పదవులు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయమని కోరుచున్నానండి. అన్ని పదవులు కాకపోయినా పంచాయితి స్థాయిలో ప్రెసిడెంట్, వార్డు మెంబర్లుతో వారికి పూర్తి స్వేచ్చ ఇప్పించాలండి.
జనాభా 300 నుండి పై బడిన దళితవాడలను గుర్తించి పంచాయితీలుగా తీర్చినప్పుడు వారికి వచ్చిన గ్రాంట్లు అన్నియు వారి వీధులలోనే ఖర్చు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందండి’ అని ముద్ర గడ తన లేఖలో సీఎంకు సూచించారు.
4 లేక 5 దళిత కుటుంబాలు వారు, ఇతర వర్షాల వారు నివశించే వీధులలో ఉండటం వల్ల దళితులకు సంబంధించిన లక్షలాది రూపాయలు గ్రాంటు 4 లేక 5 కుటుంబాలు నివసించేవారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాబా ఉన్నవారు నష్ట పోతున్నారని వారి అభిప్రాయమండి.
దయచేసి తమరు దృష్టిపెట్టి రాష్టంలో ఉన్న దళిత నాయకులతో సమావేశం మీ ఆధ్వర్యంలో పెట్టి వారి అమూల్యమైన సలహాలు తీసుకుని ముందుకు వెళితే బాగా ఉంటుందని అనిపిస్తుందండి. 26-12-2022న కాపుల కోసం రాసింది.. ఈ ఉత్తరం కూదా పూర్తిగా వ్యక్తిగతమండి’ అంటూ లేఖ ముగించారు.