తాను వైసీపీని వీడనని మాజీ మంత్రి మేకతోటి సుచరిత క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా సుచిరత పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తన భర్త వేరే పార్టీలోకి వెళితే తాను కూడా వెళ్తానంటూ ఆమె చేసిన కామెంట్సే… ఈ ప్రచారానికి కారణమయ్యాయి. దీంతో… తీవ్ర దుమారం రేగాయి. ఈ క్రమంలో ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కొందరు వ్యక్తులు వారి ఊహలకి అందిన విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాన్ని ఆధారంగా చేసుకొని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయని అన్నారు. పార్టీ మారాల్సి వస్తే గృహిణిగా మాత్రమే ఉంటానే తప్పా.. వేరే పార్టీలైతే మారనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కులం, మతం ప్రాంతాలు చూడకుండా పథకాలు అందిస్తున్నారని, అటువంటి నాయకుడి వెంటే తన ప్రయాణం సాగుతుందని అన్నారు.
ప్రజల మంచి కోరుకునే పార్టీలకి ప్రజాక్షేత్రంలో కూడా మంచే జరుగుతుందని, ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ 175/175 సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే… ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం తమ పార్టీ అధిష్టానానికి లేదని, అధిష్టానం అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. రాజకీయంగా ఎవరో అణచివేస్తే అణచివేయబడరు కానీ ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుందన్నారు.