గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో అనేక దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దోపిడీలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఓ ప్రకటన చేశారు. తాజా నిబంధనల ప్రకారంగా గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని తెలిపింది.
5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకూ గల దూరానికి రూ.20లు మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలని వెల్లడించింది. అలాగే గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కిలోమీటర్లు దాటితే ఒక్కో సిలిండర్ కు రూ.30ల చొప్పున వసూలు చేయాలని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఎల్పీజీ వినియోగదారులు 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కాల్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కోరింది. అలాగే ఆయిల్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ 1800233555 నంబర్ కు కూడా ఫిర్యాదు చేయాలని కోరింది.