టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రావులపాలెంలోని వేదికపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు మరో ఛాన్స్ ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ రెడ్డి ఒక అబద్ధాల పుట్ట అని, సైకో పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయినట్లు తెలిపారు.
భారతదేశంలో ధనిక సీఎం జగనే అని, జగన్ మనిషా, మృగమా అంటూ నిప్పులు చెరిగారు. పేదలను జగన్ నిలువునా దోపిడీ చేస్తున్నాడని, ఆయన పాలనలో నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయని, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, విజన్-2029 తయారు చేసినట్లు వివరించారు.
తాను 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నానని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, తన బాధ అంతా ఏపీ గురించి, ప్రజల గురించేనని చంద్రబాబు అన్నారు. బాబాయ్‌ని చంపిన జగన్ ఆ కేసును తనపై మోపే ప్రయత్నం చేశారని, జగన్ పాలనలో అందరూ మోసపోయారని చంద్రబాబు ఆరోపించారు. అమ్మఒడిలో కోతలు పెట్టి, రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.