తిరుపతి వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం కింద సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తున్న జనసేన అధినేత పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ల వ్యవస్థను తప్పుపడుతున్న వారిపై ఏపీ సీఎం జగన్ మరోసారి నిప్పులు చెరిగారు. తిరుపతిలోని వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం కింద లబ్ధిదారుల ఖాతాలకు ఆయన బటన్ నొక్కి నగదును జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ పెళ్లిళ్లు, విడాకులు, వివాహేతర సంబంధాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా పవన్, చంద్రబాబు, బాలయ్యపై సెటైర్లు వేశారు.
వాలంటీర్ల సేవలను చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది తప్పుపడుతూ నోటికొచ్చినట్లు మాట్టాడుతున్నారన్నారు. వారి క్యారెక్టర్స్ ఎలాంటివో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు అమ్మాయిలను ఎక్కడైనా లోబర్చుకున్నారా అని ప్రశ్నించారు. పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్ క్యారెక్టర్ అని, అలాంటి వ్యక్తి వాలంటీర్ల గురించి మాట్లాడుతాడా అని మండిపడ్డారు. ఒకరిని వివాహం చేసుకుని మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకునే వ్యక్తికి వాలంటీర్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
మరొకరు యూట్యూబ్‌లో డ్యాన్సులు చేస్తూ కనిపిస్తాడని, ఇంకోకడు అమ్మాయిలు కనిపిస్తే ముద్దులు పెట్టుకోవాలి, లేకుంటే కడుపు చేయాలని అంటాడని పరోక్షంగా బాలయ్యపై ఫైర్ అయ్యాడు. ఇంకొకరు టీవీ షోకి వెళ్లి..’బావా మీరు సినిమాల్లో చేశారు..నేను నిజంగా చేశాను’ అంటాడని విమర్శలు చేశారు. ఒక్కడిదేమో బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో సంసారం అని ఎద్దేవా చేశారు. వాలంటీర్ల క్యారెక్టర్ గురించి కోట్ల మందికి తెలుసని, వారి క్యారెక్టర్ తప్పుబట్టింది బాబుకు పదేళ్లుగా వాలంటీర్‌గా ఉన్న ప్యాకేజీ స్టార్ అని పవన్‌ను విమర్శించారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.