ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరగడం గమనార్హం. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు.
కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఢిల్లీకి వచ్చారు.
ఇప్పటికే ఏపీ సమస్యల పరిష్కారానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాధన్ నేతృత్వంలో ఇది వరకే ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీతో ఏపీ ఉన్నతాధికారుల బృందం పలు సమావేశాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, తెలంగాణ నుంచి రావలసిన విద్యుత్ బకాయిలు, బీచ్ శాండ్ మైనింగ్, కడప స్టీల్ ప్లాంట్, తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.