Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడి తప్పిందని.. ఇకనైనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరముందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భరంగా మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ఇంత దారుణమైన సీఎంని, పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చినా.. అభివృద్ధి మాత్రం లేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అప్పులమయం అయ్యింది. పాఠశాలలు, భవనాలకు రంగులు వేయడమే అభివృద్ధి కాదు. అందులో చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తే.. అదే నిజమైన విద్యాభివృద్ధని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. కానీ వాటిన్నింటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. విదేశీ విద్య కోసం టీడీపీ పార్టీ ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఆర్థిక సాయం చేసిందని వ్యాఖ్యనించారు.
వైసీపీ ప్రభుత్వాన్ని, నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలను బదిలీ చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తూ.. దోచుకుంటున్నారు. ఇప్పుడు సర్వేల పేరుతో నాటకాలు ఆడుతున్నారు. రాష్ట్రానికి జగన్ అక్కర్లేదనే సర్వలు చెబుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని మార్చలేవు. విశాఖపట్నం వెళ్లలేవు. ఏప్రిల్ తర్వాత టీడీపీ ప్రభుత్వమే వస్తుంది. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నించడం లేదు. కోట్ల ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. జగన్ వల్ల రాష్ట్రంలో ఎంతో విధ్యంసం జరిగింది. పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా గందరగోళంలోకి నెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు.