Air pods : ఎయిర్ పాడ్స్‌ని శుభ్రపరచకపోతే ఇన్ఫెక్షన్లు తప్పవు!
ఈ మధ్య యువత చెవుల్లో ఎయిర్ పాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
How To Clean Airpods At Home: ఇటీవల కాలంలో ఎయిర్ పాడ్స్(Airpods) వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. గతంలో చాలా మంది ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉండేవారు. అయితే వైర్ల, ఆ జంఝాటం నుంచి విసిగిపోయిన చాలా మంది ఇప్పుడు ఎయిర్ పాడ్స్ వాడటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే తరచుగా వీటిని వాడేవారు ఎప్పటికప్పుడు తప్పకుండా వీటిని శుభ్రం చేసుకోవాల్సిందే. లేకపోతే చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఎయిర్ పాడ్స్‌ని ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్పాడ్స్కి చివరన సిలికాన్ క్యాప్‌లు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పాడ్స్ నుంచి తొలగించి గోరు వెచ్చగా ఉన్న సబ్బు నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత ట్యాప్ వాటర్ కింద పెట్టి వాటిని శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత వాటిని తిరిగి పాడ్స్‌కి పెట్టేయాలి. అవి తీస్తే రాని క్యాప్స్ అయితే గనుక 70 శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉండే శానిటైజర్‌తో శుభ్రపరచాలి. అందుకు కాటన్ బాల్ని వాడొచ్చు.
ఎయిర్ పాడ్స్‌కి ఉండే గ్రిల్స్, మైక్ అవుట్లెట్లు, ఛార్జింగ్ పాయింట్ల లాంటి వాటికి చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే ఉంటాయి. వీటిని దూదితో శుభ్రపరచడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అందుకనే వీటిని చిన్న బ్రెజిల్స్ ఉండే సిలికాన్ బ్రష్‌తో శుభ్రం చేయాలి. దుమ్మును శుభ్రం చేసి తర్వాత తక్కువ ఆల్కహాల్ ఉన్న దూదిని తీసుకుని మెల్లగా తుడిచి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే బయట దుమ్ము కణాల వల్ల వచ్చే చెవి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.