దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నగరం లిమాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు.
కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో బస్సులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కాగా, పెరూలో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగమే కారణాలని పెరూ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.