»Pallavi Prashanth Bigg Boss Attack Incident 16 More Arrested
Pallavi prashanth: బిగ్‌బాస్ దాడి ఘటన.. మరో 16 మంది అరెస్ట్!
బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బిగ్ బాస్ షో (Biggboss Show)కు సంబంధించి రోజు రోజుకు వివాదం ముదురుతుంది. ఈ షో సీజన్ 7 ముగిసిన అనంతరం జరిగిన దాడి ఘటనపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్, ఏ2గా మనోహర్, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ను చేర్చారు. ఇప్పటికే బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్ను (Mahaveer) పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.
అయితే ఈ దాడి ఘటనపై పోలీసులు తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు. ఆర్టీసి బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి కాసేపట్లో కోర్టు ఎదుట హాజరుపరుచనున్నారు. ఇక ఈ 16 మందిలో 12 మంది మేజర్లు కాగా.. నలుగురు మైనర్లు ఉండడం విశేషం. ఈ నెల 17న బిగ్‌బాస్ ఫైనల్ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది.
టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటికి రాగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అనుదీప్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మరో పోటీదారు అశ్విని కారు అద్దాలను పగులగొట్టారు. రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగులగొట్టారు.