తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లను మంత్రి సీతక్క తప్పుపట్టారు. రామన్న.. అంత తొందర ఎందుకు.. కాస్త ఆగలేవు అని సెటైర్లు వేశారు.
Minister Seethakka: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరింది. ఒక్కో విభాగంపై క్రమంగా పట్టు సాధిస్తోంది. నామినెటెడ్ పదవులు, ఐఏఎస్, ఐపీఎస్ బదిలీ, టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన తదితర అంశాలపై ఫోకస్ చేసింది. అప్పుడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. ఆయనకు అదేరీతిలో మంత్రి సీతక్క (Minister Seethakka) కౌంటర్ ఇచ్చారు.
అధికారం పోయిందనే బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందని సీతక్క (Seethakka) సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలకు ఇంత తొందరపాటు పనికి రాదని చెప్పారు. ఇచ్చిన హామీలను తమ పార్టీ నెరవేరుస్తోందని స్పష్టంచేశారు. ఇప్పటికే 2 హామీలు అమలు చేస్తున్నారని.. మిగిలిన హామీలను 100 రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.
ప్రచార సమయంలో తమ కన్నా ఎక్కువ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇవ్వలేదా అని కేటీఆర్‌ను మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఒకవేళ ఆ పార్టీ అధికారం చేపడితే ఎలా ఇచ్చేవారని అడిగారు. అయినప్పటికీ తాము మాత్రం ఇచ్చిన ప్రతీ ఒక్క హామీ నెరవేరుస్తామని స్పష్టంచేశారు. ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన హామీని విస్మరించబోమని తేల్చిచెప్పారు. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని జనం సంబరపడుతున్నారని వివరించారు. వారి ఆకాంక్షల మేరకు రేవంత్ ప్రభుత్వం నడుచుకుంటుందని తెలిపారు.