Karnatakaలో 5 గ్యారెంటీలు అమలు కావడం లేదు: యడియూరప్ప
కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావడం లేదని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారి మాటలను నమ్మొద్దని కోరారు.
Yediyurappa: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. నేతలు, అధినేతలు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుస్తున్నారు. ప్రముఖ నేతలు, సీఎంలు కూడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజీపీ నేత యడియూరప్ప (Yediyurappa) కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. ఆయన బుధవారం హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్దపు హామీలను నమ్మొద్దని కోరారు.
5 గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని.. ఆ తర్వాత దాని ఊసే మరచిపోయిందని యడియూరప్ప (Yediyurappa) పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వారిని విశ్వసించొద్దని సూచించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసి.. ఇప్పుడు తెలంగాణ ప్రజలను వంచించే ప్రణాళిక రచించారని వివరించారు.
చేసే పనులనే తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని యడియూరప్ప తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల నేతలకు తమ పార్టీ ప్రయారిటీ ఇస్తోందని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తాయని ధ్వజమెత్తారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థులు ఏ సామాజిక వర్గానికి చెందినవారో చెప్పాలని డిమాండ్ చేశారు.