రూ. 2,000 ముఖ విలువ కలిగిన 87 శాతం నోట్లు డిపాజిట్ల (Deposits) రూపంలో బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అందులో ఇప్పటికీ రూ.12,000 కోట్లు. విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపారు. రూ.2000 నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే ఈ వెసులుబాటు కేవలం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో మాత్రమే ఉంటుందని తెలిపింది.
ఈ ఏడాది మే 19న రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రకటించే సమయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు. ఇందులో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయన్నారు. రూ.2వేల నోట్ల మార్పిడి గడువును తొలుత సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. అయితే 8వ తేదీ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
దాదాపు ప్రతి రాష్ట్ర రాజధానిలోను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. తపాలా శాఖ (Postal Department) సేవలను కూడా వినియోగించుకోవచ్చునని చెప్పారు.సెప్టెంబరు 29 నాటికి రూ.3.42 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది.దీంతో మొత్తం రూ. 14,000 కోట్ల విలువైన నోట్లు తిరిగి రావాల్సి ఉందని పేర్కొంది. అయితే ఈ తేదీని మరో వారం పాటు పొడిగించగా, ఆ తేదీ రేపటితో పూర్తి కానుంది. 14,000 కోట్ల విలువైన రూ. 2,000 ముఖ విలువ కలిగిన నోట్లు బ్యాంకులకు తిరిగి రాని నేపథ్యంలో నోట్ల మార్పిడి వ్యవధిని సెంట్రల్ బ్యాంక్ (Central Bank) మరో వారం పొడిగించింది.