బీజేపీ జాతీయ జనరల్ నేషల్ సెక్రటరీ బీఎల్ సంతోష్(BL Santosh) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హంగ్ వస్తుందని, కానీ అధికారం తమదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మనమే అధికారంలో ఉంటాం తెలంగాణ(Telangana)లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్(Hyderabad)లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మాల్సిన పనిలేదని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవాళ్లు ప్రజల్లో ఉండాలని బీఎల్ సంతోష్ సూచించారు.
అనవసరంగా నేతల చుట్టూ తిరగవద్దని తెలిపారు. టికెట్లపై నిర్ణయం ఢిల్లీ(Delhi)లో కాదని, ఇక్కడే ఉంటుందని చెప్పారు. బీజేపీకి గ్రాఫ్ పెరుగుతుందని, నేతలు ప్రజల్లో ఉండాలని బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారు. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని, ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని సంతోష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
పార్టీలో కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. టీబీజేపీలో కొందరు అసమ్మతి నేతలు ప్రధాని తెలంగాణ టూర్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. ప్రధాని సభల్లోనూ పాల్గొనలేదు. విజయశాంతి (Vijayashanti), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరికొందరు నేతలు ప్రధాని సభలకు డుమ్మా కొట్టారు. ఈ తరుణంలో బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడో రేపో ప్రకటన వెలువడనున్న తరుణంలో సంతోష్ వ్యాఖ్యలు బీజేపీ(BJP)లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.