»Students Were Harassed By Teachers To Like Their Instagram Reels
Uttarpradesh: టీచర్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ లైక్ చేయాలని విద్యార్థులకు బెదిరింపులు
స్కూల్ టీచర్లు ఇన్‌స్టా రీల్స్‌కు అలవాటు పడటంతో విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారు. అయితే తమ రీల్స్ చూసి లైక్ చేయాలని టీచర్లు వేధింపులకు గురి చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కాస్తా రంగంలోకి దిగి పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు ఇన్‌స్టా రీల్స్‌కు అలవాటు పడ్డారు. పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే రీల్స్ చేయడం మొదలు పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా సెలబ్రిటీలు అయ్యేందుకు ప్రయత్నించే క్రమంలో విద్యార్థులను బెదిరించడం మొదలుపెట్టారు. తాము చేసిన రీల్స్‌ను లైక్ చేయాలని, తమ ఇన్‌స్టా ఖాతాలను సబ్‌స్క్రైబ్ చేయాలని స్టూడెంట్స్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో టీచర్లందరూ మహిళలే ఉన్నారు. అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్ అనే ముగ్గురు మహిళా టీచర్లు గత కొన్ని రోజులుగా స్కూల్లోనే ఇన్‌స్టా రీల్స్ చేయడం మొదలు పెట్టారు. కొన్ని రోజులుగా వారు ఆ పనిలోనే ఉంటున్నారు. తాము చేసిన వీడియోలను లైక్ చేయాలని టీచర్లు విద్యార్థులను బలవంతం చేస్తున్నారు. అంతేకాకుండా వారి ఇన్‌స్టా ఖాతాను సబ్‌స్క్రైబ్ చేయాలని ఒత్తిడి చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టీచర్ల వేధింపులు తట్టుకోలేక తమ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. దీంతో తల్లిదండ్రులంతా కలిసి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగేశ్వరి ఆర్తి గుప్తాకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు తర్వాత విచారణ చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.