తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటున్న తెలంగాణ బృందం పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు పెట్టుబడులు రాగా.. తాజాగా దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చింది. డాటా సెంటర్లకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ లో మరో 3 డేటా కేంద్రాలు ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ ఓ ప్రకటన చేసింది.
దావోస్ లో మంత్రి కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్ ఆసియా అధ్యక్షుడు అహ్మద్ మజర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిపిన చర్చల్లో రూ.16 వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో మరో 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో డేటా సెంటర్ సగటున 100 మెగావాట్ల ఐటీ లోడ్ ను అందించనుంది. ఈ మూడింటితో కలిపి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రాలు మొత్తం 6కు చేరుతాయి.
మరో సంస్థ పెట్టుబడి
తెలంగాణలో మరో సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చింది. హైదరాబాద్ లో గ్లోబల్ కేపబులిటీస్ కేంద్రాన్ని రూ. 150 కోట్లతో ఏర్పాటు చేస్తామని వెబ్ పీటీ సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రం ఔట్ పేషెంట్ రీహబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమైన డిజిటల్ సేవలను అందించనుంది.