JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పెద్దపప్పూర్ మండలం తిమ్మంచెరువులో వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కల్యాణ మండపానికి భూమి పూజ చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకున్నారు. అందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు జేసీ ఇంటికి భారీగా చేరుకున్నారు. తమ ఇంటికి పోలీసులు వచ్చి, అడ్డుకోవడంపై జేసీ సీరియస్ అయ్యారు.
జేసీ ఇంటి వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతకుముందే ఆలయ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. అయినప్పటికీ పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. జేసీ ఇంటి వద్ద పోలీసుల మొహరింపుతో అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గత కొంతకాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కక్షసాధింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినప్పటికీ కౌన్సిల్లో కూడా ఆయనకు తెలియకుండా పనులు జరుగుతున్నాయి. పోలీసులు పదే పదే ప్రభాకర్ రెడ్డిని ఇబ్బందికి గురిచేస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.