భారత్(India)తో రక్షణ సంబంధాలు తమకెంతో ముఖ్యమని కెనడా డిఫెన్స్ మినిస్టర్ బిల్ బ్లెయిర్ వెల్లడించారు. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య(Murder of Nijar)పై దర్యాప్తు జరుగుతున్నా కూడా ఇతర అంశాల్లో రెండు దేశాల భాగస్వామ్యం కొనసాగడం కీలకమని తెలిపారు. ‘ది వెస్ట్ బ్లాక్’ అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మాకు ఇది (నిజ్జర్ హత్య) సమస్యాత్మకంగా మారింది. అయితే, మా దేశ భూభాగాన్ని, చట్టాలను, పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.ఈ ఆరోపణలు నిజాలుగా తేలితే అది కచ్చితంగా కెనడా(Canada)కు ఓ ఆందోళనకారక అంశంగా మారుతుంది’’ అని ఆయన అన్నారు.
అయితే, ఇండో పసిఫిక్ వ్యూహానికి కెనడా ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. నిజ్జర్ హత్య వెనకాల భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య పెను వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఖలీస్థానీ (Khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని భారత్‌పై చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారత్, కెనడాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించడం.. కెనడియన్లకు కేంద్రం వీసా నిలిపివేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన ఆరోపణలకు సంబంధించి జస్టిన్ ట్రూడో మరోసారి ప్రస్తావించారు.