»Tdp To Boycott Ap Assembly Session 2023 From Tomorrow
TDP: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరణ
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ నేతల తీరుతో ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రేపటి నుంచి జరిగే సమావేశాలకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.
TDP to boycott AP assembly session 2023 from tomorrow
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP assembly session 2023) ఈరోజు రెండో రోజు ప్రారంభమయ్యాయి. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంతో మొదలయ్యాయి. అయితే, టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు. అయితే సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను 10 నిమిషాల పాటు వాయిదా వేసి మళ్లీ తిరిగి ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు సహా పలువురు మంత్రులు టీడీపీ సభ్యుల(tdp members) తీరుపై మండి పడ్డారు. అంతేకాదు ఇది అసెంబ్లీ అని, తమ పార్టీ కార్యాలయం కాదని టీడీపీ సభ్యులకు గుర్తు చేస్తూ అనవసర పదజాలం వాడొద్దని హెచ్చరించారు. వారి ప్రవర్తనను నియంత్రించుకోవాలని, కొనసాగుతున్న చర్చలో వారు పాల్గొనాలని వారికి సూచించారు. మరోవైపు స్పీకర్ కూడా టీడీపీ సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించలేదు. దీంతో టీడీపీ సభ్యులు అధికార పార్టీ వైసీపీ(YSRCP) నేతల తీరుతో అసంతృప్తి చెంది కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలకు హాజరుకాబోమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అధికార పార్టీ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.