»Onion Prices May Reach To 60 70 Rupees Per Kg In September Will Start Easing From Octobe
Onion Price Rise: ముందుంది ఉల్లి ధర ఘాటు
టమాటా ధర తగ్గుతుంది అనుకునే లోపే ఉల్లి ఘాటు ఎక్కువవుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30-35 వరకు లభిస్తుండగా గత కొద్ది రోజులుగా ధర పెరుగుతోంది.
Onion Price Rise: పండుగల సీజన్ ప్రారంభమైనా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఊరట లభించడం లేదు. గత కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్న టమాటా కాస్త శాంతించి జనాలకు రిలీఫ్ ఇవ్వడం మొదలుపెట్టింది. టమాటా ధర తగ్గుతుంది అనుకునే లోపే ఉల్లి ఘాటు ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30-35 వరకు లభిస్తుండగా గత కొద్ది రోజులుగా ధర పెరుగుతోంది. ప్రతి భారతీయ ఇంటి వంటగదిలో ఉల్లిపాయను ఉపయోగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి ధరల పెరుగుదల కారణంగా వంటగది బడ్జెట్‌ను నిర్వహించడం ప్రతి ఒక్కరికీ కష్టంగా మారనుంది. సెప్టెంబర్ నెలలో ఉల్లి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు కిలో రూ.60-70కి చేరుకోవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ నివేదిక పేర్కొంది. భవిష్యత్‌లో ఉల్లికి రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. మార్కెట్లో కిలో రూ.30-35 చెల్లిస్తున్న ఉల్లి, రాబోయే రోజుల్లో అదే ఉల్లికి కిలో రూ.60-70 చెల్లించాల్సి రావచ్చు. ఈ విషయంలో కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. నెలరోజులుగా ఉల్లి ధరలు టమాటాలా ఇబ్బంది పెట్టకపోవడమే. క్రిసిల్ నివేదిక ప్రకారం ఆగస్టు చివరి నుండి ఉల్లి ధరలు పెరగడం ప్రారంభించాయి, ఇది సెప్టెంబర్‌లో అధిక స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత అక్టోబరులో మండీలకు ఖరీఫ్ పంటల రాక ప్రారంభం కానుండడంతో ఉల్లి ధరలు మెత్తబడతాయి. ఉల్లి ధరలు 2020లో కనిపించిన అధిక స్థాయి కంటే తక్కువగా ఉండబోతున్నాయని క్రిసిల్ కూడా ఉపశమనం ఇచ్చింది.
ఉల్లి ధరలు పెరుగుతాయనే భయంతో ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. గత వారం ఉల్లి ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. దేశీయ మార్కెట్లో డిమాండ్‌కు తగినట్లుగా ఉల్లి అందుబాటులో ఉండేలా, ధరను నియంత్రించడానికి ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఇది డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఉల్లి నిల్వల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టమాటాల మాదిరిగా కోఆపరేటివ్ ఏజెన్సీలు కూడా సామాన్యులకు రాయితీపై ఉల్లిని అందిస్తున్నాయి.