తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ టీడీపీకి అనుకూలంగానే ఉంటున్నాడనేది వైసీపీ వాదన. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య పైన మాట్లాడని పవన్ కళ్యాణ్, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏ సమస్య లేకపోయినా విమర్శలు గుప్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత అధినేతల కలయికపై వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
మంత్రి అంబటి రాంబాబు వీరి భేటీపై ట్వీట్ చేశారు. సంక్రాంతికి అందరి ఇంటికి గంగిరెద్దులు వెళ్తాయని, చంద్రబాబు ఇంటికి మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్లాడని, ఎందుకంటే బసవన్నలా తల ఊపడానికి అంటూ సెటైరికల్‌గా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, పవన్ భేటీతో వైసీపీ నాయకులు, మంత్రులకు ప్యాంట్లు తడుస్తున్నాయ్, ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా డైపర్లు వాడండి అంటూ అంతే సెటైరికల్‌గా పోస్ట్ చేశారు.
కాగా, ఈ భేటీలో విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ పైన, కుప్పం పర్యటనలో చంద్రబాబు పైన ప్రభుత్వ ఆంక్షలు, వేధింపుల నేపథ్యంలో ఇరువురు పరస్పరం సంఘీభావం తెలుపుకున్నారు. ప్రతిపక్షాలను సంఘటితం చేసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని గత భేటీ సందర్భంగా చెప్పారు. తాజా భేటీ తర్వాత భవిష్యత్తులో కలిసి పని చేస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి రాజకీయ, ప్రజా, న్యాయ పోరాటాలు చేస్తామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని తాము ఖచ్చితంగా ఓడిస్తామనే భయంతో అణచివేత చర్యలకు పాల్పడుతోందని, రాబోయే రోజుల్లో అవి మరింత పెరిగే అవకాశముందని పవన్ కళ్యాణ్ అన్నారు.