ఉత్తరాంధ్ర కాపులు అందరూ తూర్పు కాపులని, ఇందుకు అనుగుణంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన తూర్పు కాపు సంక్షేమ సంఘం వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుల ధృవీకరణలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అయిదు తరాలుగా తమ కుటుంబానికి కాపులు అండగా ఉన్నారని, వారి సంక్షేమానికి అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. తూర్పు కాపుల కోసం ప్రత్యేకంగా కళ్యాణ మండప నిర్మాణానికి స్థలాన్ని చూడాలని సూచించినట్లు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
కాపు వన సమారాధనలో బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ బంధాలు, బంధుత్వాలు శాశ్వతమని చెప్పారు. ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఉంటారని, అలాంటి వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నత స్థానంలో ఉండి మరొకరికి చేయూతనివ్వడం ఎంతో సంతృప్తికరంగా ఉంటుందన్నారు. రాజకీయాలు, పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. కుటుంబం, బంధువులు, కులం, ప్రాంతంతో అనుబంధాలు ముఖ్యమన్నారు. అవకాశం ఉన్నంత వరకు అందరూ తోటి వారికి సహకరించాలన్నారు. ఉన్నతస్థానంలో ఉన్న వారు వెనుకబడిన వారికి తోడ్పాటును అందించాలన్నారు.