Agni-1: బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-1 (Agni-1) ట్రైనింగ్ పరీక్ష విజయవంతం అయ్యింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం పేర్కొంది. ఒడిశాలో (odisha) గల ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి-1 ప్రయోగం నిర్వహించింది. విజయవంతం కావడంతో భారత్ మరో మైలురాయిని దాటిందని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ బాబు పేర్కొన్నారు. ప్రయోగం జరిపే సమయంలో మిస్సైల్ కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించిందని తెలిపారు. అగ్ని-1 క్షిపణి అన్ని కార్యాచరణ, సాంకేతిక పరిమితులను ధృవీకరించిందని తెలిపారు.
గత రెండు దశాబ్దాల నుంచి భారతదేశం బాలిస్టిక్ క్షిపణులు, కచితత్వంతో ప్రయోగించాయి. అగ్ని క్షిపణులకు సంబంధించి వివిధ రకాల శ్రేణులను డెవలప్ చేసింది. గత డిసెంబర్లో 5 వేల కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-వి ని విజయవంతంగా ప్రయోగించింది. అంతకుముందు అగ్ని 1 నుంచి అగ్ని 4 క్షిపణులను ప్రయోగించింది. ఇవీ 700 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించాయి. ఏప్రిల్లో ఒడిశా తీరం నుంచి బంగాళాఖాతం సముద్రంలో ఓడ మీద బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.