మొబైల్ ఫోన్ షర్ట్ జేబులో పేలడంతో ఓ వృద్ద వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇలియాస్ అనే వ్యక్తి మరోట్టిచల్ ప్రాంతంలోని ఓ టీ దుకాణంలో కూర్చొని స్నాక్స్ తింటున్నాడు. జేబులో ఉన్న అతని ఫోన్ అకస్మాత్తుగా పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో అతని షర్ట్ కు మంటలు అంటుకున్నాయి.
జేబులోనే మోబైల్ కాలిపోయింది. మోబైల్ ను జేబులో నుంచి బయటకు పడేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక నెలలోపే రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. ఈ సంఘటన యొక్క విజువల్స్ వైరల్ అయ్యాయి. మీడియాలో కూడా చూపించబడ్డాయి.
మంటలు అంటుకున్న వెంటనే వృద్ధుడు వెంటనే పైకి లేచి, తన జేబులో నుండి ఫోన్ తీయడానికి ప్రయత్నిస్తాడు. ఫోన్ అతని జేబులో నుండి నేలపై పడింది. మంటలు అలాగే మండుతుండటంతో షాపు అతను మొబైల్ పై నీళ్లుపోసి ఆర్పాడు. ఈ సంఘటన ఒల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వృద్ధుడిని పిలిచినట్లు తెలిపారు.
ఏడాది క్రితం రూ.1000కు మొబైల్ కొనుగోలు చేశానని, అది ఫీచర్ ఫోన్ అని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఇప్పటి వరకు ఈ పరికరంలో ఎలాంటి సమస్యలు లేవని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. గత వారం, కోజికోడ్ నగరంలో ఇదే విధమైన సంఘటన జరిగింది, ప్యాంటు జేబులో ఉంచిన మొబైల్ ఫోన్ పేలడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. అంతకు ముందు, ఏప్రిల్ 24న, త్రిసూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఆమె ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ పేలి మరణించింది.