ఏపీలోని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్పర్సన్ రేఖా శర్మ సీరియస్ అయ్యారు. సీఐ దురుసు ప్రవర్తనతో ఆమెపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖాశర్మ లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన మహిళకు వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు సీఐ అంజూ యాదవ్ తాను కావాలని దాడి చేయలేదని ఆడియో రిలీజ్ చేశారు. తాను తప్పు చేయలేదని అంటున్నారు.
ఏం జరిగిందంటే..
ఇటీవల శ్రీకాళహస్తిలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీఐ అంజూయాదవ్ వెళ్లారు. ఆ క్రమంలో అతడు లేకపోవడంతో అతని భార్యను సీఐ ప్రశ్నించారు. అంతేకాదు అతని భార్యపై శారీరకంగా దాడి చేసి బెదిరించారు. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా..ఇటీవల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఏపీ పోలీసుల తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని వంగలపూడి అనిత మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సీఐపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరింది.