ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా.. ఈ విషయం పై బాలకృష్ణ కూడా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పై తన దైన శైలిలో మండిపడ్డారు.
మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని బాలయ్య అన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అని చెప్పారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ (శంషాబాద్ విమానాశ్రయం) పేరు మార్చాడని… కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నాడని మండిపడ్డారు.
మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని, పంచభూతాలున్నాయని, తస్మాత్ జాగ్రత్త అని బాలకృష్ణ హెచ్చరించారు. అక్కడ (వైసీపీలో) ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారని ఎద్దేవా చేశారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు కూడా వెక్కిరిస్తున్నాయని అన్నారు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని మండిపడ్డారు.
తెలుగువాడి గుండెల్లో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఉన్నట్టుగా కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ ను కూడా షేర్ చేయడం గమనార్హం. ఇప్పుడు బాలయ్య పోస్టు వైరల్ గగా మారింది. అభిమానులు సైతం షేర్ చేస్తున్నారు.