»17 74 Kg Of Gold Worth Seized At Rameshwaram Mandapam Tamilnadu Rs 10 50 Crore Value
18 కిలోల గోల్డ్ పట్టివేత..సముద్రంలో పడేసినా కూడా!
తమిళనాడు రామేశ్వరంలోని మండపం తీరంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గోల్డ్ శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తమిళనాడు(tamilnadu) రామేశ్వరం(rameshwaram)లోని మండపం(mandapam) సముద్ర తీరంలో అక్రమంగా రవాణా చేస్తున్న దాదాపు 18 కిలోల (17.74 కిలోలు) బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో ఫిషింగ్ బోట్తోపాటు ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 10.5 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సరకు శ్రీలంక నుంచి అక్రమంగా దేశానికి రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళితే..
ఇండియన్ కోస్ట్ గార్డ్(indian coast guard) సిబ్బంది, డీఆర్ఐ(DRI) అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మండపంతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో అనుమానాస్పద వ్యవహారాలపై అధికారులు నిఘా పెంచారు. అదే క్రమంలో తమిళనాడు రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన ఓ ముఠా శ్రీలంక నుంచి భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వారికి సమాచారం అందింది. దీంతో వారిని ఎలాగైనా పట్టుకోవాలని అధికారులు సిద్ధమయ్యారు. అదే క్రమంలో బుధవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు చేపల పడవలో మండపం తీరంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్నారు.
వారిని గుర్తించిన అధికారుల బృందం కోస్ట్ గార్డ్ ఇంటర్‌సెప్టర్ బోట్‌తో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ దుండగులు బోటును స్పీడుగా నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరికి అధికారులు వారిని పట్టుకుని బోటును సోదా చేయగా…అధికారులకు ఎలాంటి వస్తువులు సహా ఏమి దొరకలేదు. ఆ క్రమంలో ఏదైనా వస్తువులు సముద్రంలో విసిరి ఉండవచ్చని అనుమానించిన అధికారులు డీప్ డైవర్ల సహాయంతో సముద్రంలో సెర్చ్ ఆపరేషన్(search operation) నిర్వహించారు. ఆ క్రమంలో వారికి సముద్రంలో బంగారు కడ్డీలతో కూడిన ఓ బ్యాగ్ లభ్యమైంది. వాటిలో కడ్డీలు, గొలుసులు సహా వివిధ రూపాల్లో ఉన్న ఫారెన్ గోల్డ్ 14 ప్యాకెట్లలో టవల్లో కట్టి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆ మొత్తం బంగారం 17.74 కేజీలు(17.74 kg gold) ఉండగా వాటి విలువ 10.5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.