»Fire Accident In Furniture Godown Hyderabad Today
FIRE :హైదరాబాద్ ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌లోని ఓ ఫర్నిచర్, రెగ్జీన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పై అంతస్థులో చిక్కుకుపోయిన 20 మందిని స్థానికులు నిచ్చెనల సహాయంతో కాపాడారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
FIRE ACCIDENT : హైదరాబాద్‌లో(HYDERABAD) వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఓ ఫర్నిచర్, రెగ్జీన్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌లో ఈ గోదాం ఉంది. భవనం మూడో అంతస్థులో 20 మంది చిక్కుక్కున్నారు. అగ్నిమాపక సిబ్బంది త్వరగా అక్కడికి చేరుకుని మంటలను ఆపే ప్రయత్నం చేశారు. నిచ్చెనలను ఉపయోగించి చిక్కుకున్న వారందరినీ కిందకి దించారు. అయినా వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. ఉదయానికి కూడా అక్కడ మంటలను అదుపు చేసే కార్యక్రమం కొనసాగుతోంది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కింది అంతస్థులో మొదలైన మంటలు చెలరేగి భవనం పై వరకు వ్యాపించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ గోదాంలో ఎలాంటి అగ్నిమాపక ప్రమాణాలనూ పాటించలేనట్లు అధికారులు తెలుసుకున్నారను. అలాగే రాత్రి సమయంలో అంత మంది అక్కడ ఎందుకు ఉన్నారనే విషయంపైనా పోలీసులు, అధికారులు దృష్టి సారించారు. ఈ విషయమై గోదాం యజమానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నడుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.