»New Criminal Cases New Criminal Laws Will Be Implemented From July 1
New Criminal Cases: జులై 1 నుంచి కొత్త నేర న్యాయచట్టాలు అమలు
జులై 1 నుంచి కొత్త నేర న్యాయ చట్టాల విచారణ ప్రక్రియలో మార్పులు రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్తో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో మార్పులు రానున్నాయి.
New Criminal Cases: New criminal laws will be implemented from July 1
New Criminal Cases: జులై 1 నుంచి కొత్త నేర న్యాయ చట్టాల విచారణ ప్రక్రియలో మార్పులు రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్తో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం వంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ ఇకపై వేగవంతం అవుతుంది. ఈ కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ కసరత్తు కూడా ప్రారంభించింది. ఈక్రమంలో దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది.
బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. దీనివల్ల వేగవంతంగా చర్యలు తీసుకోవచ్చు. అలాగే జీరో ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు. అంటే ఏ వ్యక్తి అయిన పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయిన ఫిర్యాదు చేయవచ్చు. అరెస్టు సందర్భాల్లో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. దీనిద్వారా బాధితుడు వెంటనే సహాయం పొందే అవకాశం ఉంటుంది. కొన్ని నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. వారు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపై సమన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించవచ్చు. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళాసిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాటు 15ఏళ్ల లోపు పిల్లలు, 60ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు తాము నివాసమున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.