Real Estate: బాబు రాకతో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం
ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ మార్పు.. అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రమైన మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉంటే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏం చెబుతున్నారు?
Real Estate: కూటమి నేతృత్వంలో చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడింది. దీంతో అందరి దృష్టి ప్రస్తుతం అమరావతిపై పడింది. ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వేగంగా ప్రణాళికలు తయారౌతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో తమ వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించిన అనేక సంస్థలు …ఏపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమౌతున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి అభివృద్ధి ప్రారంభమైతే… ఆ ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై దాదాపు 10 నుంచి 15 శాతం వరకు ప్రభావం చూపే అవకాశాలున్నట్లు ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళికలు తయారు చేశారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంతో అమరావతిలో పనులు నత్తనడకన సాగాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత … ఆంధ్రప్రదేశ్‌ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. సమస్యలతో పారాటం చేస్తుండగా ఐదేళ్లు పూర్తయిపోయాయి. 2019లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రాగానే… అమరావతిని పక్కన పెట్టేశారు. అమరావతి ఓ వైట్ ఎలిఫెంట్ అవుతుందని భావించిన జగన్… వేరే ప్లాన్‌తో ముందుకు వెళ్లారు. జగన్ పాలనను ఏపీ ప్రజలు తిరస్కరించారు. మరోసారి చంద్రబాబు నాయుడును అధికారం పీఠంపై కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరాన్ని ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు .. హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. అటువంటి సమర్ధత కలిగిన ముఖ్యమంత్రి ఏపీని కూడా అభివృద్ధి బాటలో నడిపించగలరనే నమ్మకం… అనేక మంది వ్యాపారవేత్తలకు కలుగుతోంది. ఆ నమ్మకమే వారిని అమరావతివైపు అడుగులు వేసే దిశగా ప్రోత్సహిస్తోంది.
ఏపీకి చెందిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్‌లోనే తమ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రూపురేఖలు మారనుండడంతో … అక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ బిజినెస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ పవిత్రా శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారత దేశంలో ఏపీలో ఒక్క రాష్ట్రంలోనే తమ సంస్థ లేదని, ప్రస్తుతం అక్కడ మారిన పరిస్థితుల రీత్యా … పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. అదే విధంగా గోద్రెజ్ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.