బంగారం, వెండి ధరలు వరుసగా రోజూ పెరుగుతూనే కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా అరకొరగా తగ్గినా మళ్లీ మరుచటి రోజు అంతకు మించి ధర పెరుగుతోంది. మొత్తానికి ఇవి పెరగటమేకాని ఎంత పెరిగిందో అంత తగ్గడం అనేది మాత్రం కనిపించడం లేదు. నేటి ధరలను ఇక్కడ చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొన్ని నెలలుగా ఒకే లాంటి ట్రెండ్ కొనసాగుతోంది. రోజూ పెరగడం, ఎప్పుడో ఒకసారి కాస్త తగ్గడం అన్నట్లుగానే పరిస్థితి ఉంది. బుధవారం కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.385 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు రూ.73,850కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ రేట్లు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, ప్రొద్దుటూరు లాంటి చోట్లా పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,850గానే కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. నగల్ని కొనుక్కునేప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని కొనుగోలుదారులు గమనించుకోవాలి.
ఇక వెండి ధరలు సైతం భారీగా పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రికార్డు ధరలకు చేరిన వెండి మళ్లీ కాస్త తగ్గుతూ వచ్చింది. బుధవారం మళ్లీ రూ.545 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.90,980కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లోనూ దాదాపుగా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం పెరిగాయి. నేడు 12 డాలర్లు పెరిగి ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2315 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 29.49 డాలర్లుగా ఉంది.