»Israel Attack On Gaza 274 Palestinians Killed Hundreds Injured
Israel Gaza War : గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 274 మంది పాలస్తీనియన్లు మృతి
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడిలో కనీసం 274 మంది పాలస్తీనియన్లు మరణించారు.. వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న నలుగురిని రక్షించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
Israel Gaza War : గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడిలో కనీసం 274 మంది పాలస్తీనియన్లు మరణించారు.. వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న నలుగురిని రక్షించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ ప్రాంతంలో పగటిపూట నిర్వహించిన సంక్లిష్ట ఆపరేషన్లో తమ బలగాలు భారీ కాల్పులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7న హమాస్ దాడితో ప్రారంభమైన ఎనిమిది నెలల సుదీర్ఘ యుద్ధంలో పాలస్తీనాకు ఇది పెద్ద నష్టంగా పరిగణించబడుతుంది. చాలా మంది బందీలను జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో లేదా హమాస్ సొరంగాల లోపల ఉంచినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఫిబ్రవరిలో ఇదే విధమైన దాడిలో ఇద్దరు బందీలను రక్షించారు. ఇందులో 74 మంది పాలస్తీనియన్లు మరణించారు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 36,700 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. శనివారం జరిగిన దాడిలో దాదాపు 700 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఎంతమంది మహిళలు, పిల్లలు ఉన్నారో మంత్రిత్వ శాఖ చెప్పలేదు, అయితే దాడి తర్వాత సమీపంలోని డెయిర్ అల్-బలాహ్లోని అల్-అక్సా ఆసుపత్రిలో పలువురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు, గాజాలోని ఆస్పత్రిలో రోగుల రద్దీ నెలకొంది. రోగులను చేర్చుకోవడానికి స్థలం లేదు. గాయపడిన ప్రజలు సమీపంలోని ఆసుపత్రులకు పోటెత్తారు. ఈ ప్రాంతంలో భారీ ఇజ్రాయెల్ దాడుల నుండి గాయపడిన వారికి చికిత్స చేయడానికి వైద్యులు కష్టపడుతున్నారు.
అల్-అక్సా ఆసుపత్రిలో పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్కు చెందిన కరిన్ హుస్టర్ మాట్లాడుతూ.. దాడిలో గాయపడిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారని చెప్పారు. పిల్లలు షాక్లో ఉన్నారు. చనిపోయిన తల్లిదండ్రుల కోసం రోదిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఒక ప్రత్యేక దళాల అధికారి మరణించాడని చెప్పారు. నుస్రత్ శిబిరం మధ్యలో 200 మీటర్ల (219 గజాలు) దూరంలోని రెండు అపార్ట్మెంట్లలో బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హాగ్రీ విలేకరులకు తెలిపారు. రెస్క్యూ టీమ్లను రక్షించేందుకు, బందీలను విడిపించేందుకు సైన్యం విమానంతో సహా భారీ బలాన్ని ఉపయోగించిందని ఆయన చెప్పారు. శనివారం నాటి ఆపరేషన్ అక్టోబరులో జరిగిన దాడి తర్వాత విడుదలైన బందీల సంఖ్యను ఏడుగురికి చేర్చింది. ఇజ్రాయెల్ సైనికులు 16 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.