Toll charges: ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) తెలిపింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఇదే విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో వాహనదారులకు గుండెల్లో పిడుగుపడ్డట్లు అయింది. ఫాస్ట్‌ట్యాగ్ మార్గాన ఛార్జీలు కడుతున్నారు.. ఇదీ కాకుండా డైరెక్ట్‌గా డబ్బులను కూడా చెల్లిస్తున్నారు. అయితే ఈ ఛార్జీల పెంపు నిర్ణయం ఇదివరకే తీసుకున్నప్పటికీ కొన్నికారణాల వలన దాన్ని అమలు చేయలేకపోయేవారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో టోల్ ఛార్జీలు ఈ రోజు రాత్రి నుంచి పెరగనున్నాయి. రెండు నెలల క్రితం ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఛార్జీలు పెంచడం సరైంది కాదు అని చెప్పడంతో అప్పుడు వాయిదా వేసుకున్నారు. తాజాగా ఇప్పుడున్న రేట్లకు 5 శాతం పెంచుతూ తాజా ప్రకటన చేసింది.