Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పెను ప్రమాదం తప్పింది. షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (Helicopter) టేకాఫ్ అయిన కాసేపటికే కంట్రోల్ తప్పింది. బిహార్ (Bihar)లోని బెగుసరయ్‌లో ఈ ఘటన జరిగింది. సోమవారం బెగుసరయ్‌లో ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత హెలికాప్టర్లో బయల్దేరారు. హెలికాప్టర్ టేకాఫ్ అయింది. గాల్లో ఎగిరిన కాసేపటికి నియంత్రణ కోల్పోయి ఊగిసలాడింది. కుడివైపు పూర్తిగా వంగింది. ఒక సమయంలో హెలికాప్టర్ నేలను ఢీ కొట్టబోయింది. పైలట్ వెంటనే అప్రమత్తమై హెలికాప్టర్‌ను కంట్రోల్ చేశారు. దాంతో సరైన మార్గంలో వెళ్లింది.
హెలికాప్టర్ తృటిలో తప్పిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో లోక్ సభ ఎన్నికల హడావిడీ మొదలైన తరువాత అమిత్ షాకు ఇలాంటి సంఘటనలు రెండు సార్లు జరిగాయి. గతవారం షా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో వాతావరణం అనుకూలించలేదు. దాంతో చాలా సమయం వరకు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఘటన ఏప్రిల్ 21న చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా వాతావరణం ప్రతిఘటించడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ విఫలమైంది. దాంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు.